మొక్కల మణిహారం మన విశాఖనగరం

మొక్కల మణిహారం మన విశాఖనగరం

అందాల నందనవనం – మొక్కల మణిహారం మన విశాఖనగరం ,
పచ్చదనాన్ని మరింతగా పెంచుదాం.

ఒక పక్క సముద్రం – మరో పక్క పచ్చని కొండలు – అటువైపు కనువిందు చేసే పంట పొలాలు – ఎర్రమట్టి దిబ్బలు ఒకటేమిటి ఇలాంటి రమణీయతలు మన విశాఖపట్నానికి ప్రకృతిచ్చిన వరాలు. అందుకే అందాల సిరి మన విశాఖనగరం. కొంతమంది హుద్ హుద్ పేరుతో జనాన్ని భయపెట్టాలని ప్రయత్నించినా… తుపాను తర్వాత మళ్లీ పచ్చని చీర చుట్టుకుందీ నగరం. దేశ తూర్పుతీరంలోనే మూడో అతిపెద్ద నగరమైన వైజాగ్ కు మరింతగా పచ్చదనాన్ని – పరిశుభ్రతను అద్దడానికి కంకణబద్దులమవుదాం. ఈ ఉద్దేశంతోనే బీచ్ లో స్కేవోలా టకాడా (నౌపాక) అనే ఔషధ మొక్కల నాటడానికి శ్రీకారం చుట్టాం. వాటిని పెంచే బాధ్యతనూ చేపట్టాం. ఈ బృహత్తర కార్యక్రమం ఒక నిరంతర ప్రక్రియ. ఇవి ఉష్ణోగ్రతను తగ్గించేందుకు, గాలిలో ఆక్సిజన్ వాయువు పెంచేందుకే కాదు భవిష్యత్ లో తీర ప్రాంత కోతను, ప్రకృతి విపత్తుల తీవ్రతనూ తగ్గిస్తాయి. అందాల విశాఖకు మరిన్ని సొబగులద్ది… పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టిస్తాయి. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలను నాటాలని ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డిగారు సంకల్పిస్తే… విశాఖలో ఏడాదిలో 2 కోట్ల మొక్కలను పెంచాలని నిర్ణయించాం. ఇందుకోసం ప్రజలు, నాయకులు, అధికారులు,ఎన్జీఓలు సహా పలు సంస్థల సాకారాన్ని తీసుకుందాం.

అవసరాలు, బాధ్యతల రీత్యా దేశంలో ఎక్కడ ఉన్నా ఈ నగరానికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని మనసు ఉవ్విళ్లూరుతుంది. విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోంది. కాబట్టి నగరం ఐదేళ్లలో 25 నుంచి 30 శాతం విస్తరిస్తుంది. విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం 2050 నాటికి 66 శాతం జనాభా నగరాలు- వాటి శివార్లలోనే నివసిస్తారు. అర్బన్ ఫారెస్టింగ్ 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలను తగ్గిస్తుందని, ఏసీల వాడకం 30 శాతం తగ్గుతుందని ఐ.రా.స. పరిశోధనల్లో తేలింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీలైనన్నీ ఎక్కువ మొక్కలు నాటితే… భవిష్యత్ లో ఎక్కడ చూసినా కంక్రీట్ బిల్డింగ్ లు కనిపించకుండా పచ్చని చెట్లే కనువిందు చేస్తాయి. పర్యావరణ మార్పులను అడ్డుకుని… కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను తగ్గిస్తాయి. వర్షాలు విస్తారంగా కురవడానికి దోహదపడతాయి.

ఉమ్మడి రాష్ట్రంలోనైనా మరెప్పుడైనా ఈ నగరంపై ప్రభుత్వాలు పెద్దగా ఫోకస్ పెట్టలేదు. స్వతహాగా ఎదిగిన స్వచ్ఛమైన నగరమిది. మరి మనందరం కలిసి… సిటీలో మొక్కలు నాటడం నుంచి ఒక్కో అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటూ పోతే – ప్రపంచంలోనే టాప్ ఫైవ్ సిటీల్లో ఒకటికాదా? జీవ వైవిద్యాన్ని కాపాడుకుందాం – ఆయురారోగ్యాలతో ఆహ్లాదకరంగా జీవిద్దాం.

#GreenVizag #CleanVizag