బాబు పాలనలో రాజ్యాంగ స్ఫూర్తి ఏది?
బాబు పాలనలో రాజ్యాంగ స్ఫూర్తి ఏది?
ప్రతిపక్షం, మహిళలు, దళితులు, మీడియాపై దాడి
అన్యాయం, అక్రమాలు, ధనార్జనే ధ్యేయంగా టీడీపీ పాలన
వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ధ్వజం
ఈ నెల 29తో వెయ్యికిలోమీటర్ల మైలురాయికి ప్రజాసంకల్పయాత్ర
వెంకటగిరి నియోజకవర్గంలో స్తూపం ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగ నిర్మాతలు ఊహించినదానికి భిన్నంగా చంద్రబాబు పాలన సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షం, మహిళలు, దళితులు, మీడియాపై దాడులు పెరిగిపోయాయని, అన్యాయం, అక్రమాలు, ధనార్జనే ధ్యేయంగా టీడీపీ పాలన సాగుతుందని ఆయన విమర్శించారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి ఆయన బుధవారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవస్థలను మేనేజ్ చేసే ఘనుడు చంద్రబాబు అని, ప్రభుత్వంలోని న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్సార్సీపీ నుంచి 22మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వారిలో కొందరిని మంత్రులుగా చేసి.. రాజ్యాంగ వ్యవస్థను నీరుగార్చారని విజయసాయిరెడ్డి విమర్శించారు. అనర్హత వేటువేయాల్సిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడం ఇదే తొలిసారి అని అన్నారు. ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ.. మిగతా సామాజిక వర్గాలను, ప్రజలను విస్మరించేలా కార్యనిర్వాహక యంత్రాంగం వ్యవహరిస్తోందని అన్నారు.
భూసేకరణ చట్టంలో తనకు అనుకూలంగా మార్పులు చేసుకొని.. ప్రాజెక్టులన్నింటినీ తన మనుషులకు వచ్చేలా చంద్రబాబు చూశారని ఆరోపించారు. ప్రాజెక్టులు, కాంట్రాక్టుల ద్వారా ఆర్జించిన అవినీతి సొమ్మును మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. డీజీపీ నియామకం విషయంలో అకస్మాత్తుగా మార్పులు చేసి.. తన అడుగులకు మడుగులొత్తేవాళ్లని నియమించుకున్నారని దుయ్యబట్టారు. ఫైబర్ గ్రిడ్ పేరుతో డిజిటల్ మీడియాతో నియంత్రించే పరిస్థితిని చంద్రబాబు తీసుకొచ్చారని, తనకు గిట్టని చానెళ్లను, వ్యతిరేక చానెళ్లను లాకౌట్ చేసే పరిస్థితి కల్పించారని అన్నారు. అనుమతిలేని బోటులో రాష్ట్రపతి సతీమణిని ప్రయాణించేలా చేసి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి అపకీర్తి తెచ్చిందని అన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను నడిరోడ్డుమీద నరికి చంపినా.. అందుకు బాధ్యులను అరెస్టు చేయడం లేదని, చట్టవ్యతిరేక శక్తులను బాబు ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు.
వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్న ప్రజాసంకల్పయాత్ర
పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 29వ తేదీతో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంటుందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వెంకటగిరి నియోజకవర్గంలో స్తూపాన్ని ఏర్పాటుచేస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. మూడువేల కిలోమీటర్లు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. ప్రజల సమస్యలు, ఆకాంక్షలు తెలుసుకొని.. ఎన్నికలనాటికి వారి సమస్యలకు పరిష్కారమార్గాన్ని ఆలోచించి, ప్రజల మన్ననలు పొందేవిధంగా పరిపాలన అందించేందుకు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ప్రజాసంకల్పయాత్ర వెయ్యికిలోమీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి మండలంలోనూ, నియోజకవర్గస్థాయిలోనూ, జిల్లాస్థాయిలోనూ మార్చ్ లేదా పాదయాత్ర వంటి కార్యకలాపాలు చేపట్టాలని, దేశవ్యాప్తంగా తెలుగువారు ఉన్నచోట, విదేశాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు ఉన్నప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.
Recommended Posts
In media on 3 June 2024
03/06/2024
In media on 14 May 2024
14/05/2024
In media on 12 May 2024
12/05/2024