in media on 11 October 2018

in media on 11 October 2018

ఇది ప్రజాకంటక పాలన

Ysrcp Leader Vijaya Sai Reddy Fire On Chandrababu Naidu - Sakshi

సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గాల సమన్వయకర్తలు

చిన్న వెంకన్న సాక్షిగా బాబు జిల్లాకు ఏం చేశారో చెప్పాలి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ధ్వజం

రానున్నది రాజన్న రాజ్యమేనని స్పష్టీకరణ

ఏలూరు (టూటౌన్‌): గత ఎన్నికల్లో టీడీపీ, దాని మిత్రపక్షం బీజేపీకి జిల్లాలోని మొత్తం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు  కట్టబెట్టిన జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేశారో చిన్నతిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాల ఇన్‌చార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ జిల్లా, నగర పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతోపాటు పార్లమెంటరీ, నగర అనుబంధ సంఘాల నాయకులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లా కన్వీనర్, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ ఆళ్ల నాని అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కట్టగట్టుకుని పట్టం కట్టబెట్టినందుకు జిల్లా ప్రజలకు గూండాయిజం, రౌడీయిజం, దౌర్జన్యం, దోపిడీ,  ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ మైనింగ్‌ బహుమానంగా ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు.  చంద్రబాబునాయుడు తన మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తూ అంతులేని అక్రమాలు చేయించారన్నారు. ఇప్పటికీ కొల్లేరు ప్రజలపై అనుసరిస్తున్న వైఖరిలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. కల్లబొల్లి మాటలతో వారిని మభ్యపెడుతున్నారన్నారు.

 ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించాల్సి ఉండగా దానికి బదులు ప్రజా కంటక పాలన అందిస్తోందని విమర్శించారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళలకు పూర్తిగా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి చివరకు డిపాజిట్ల ముసుగులో కంటితుడుపుగా విదిల్చారని పేర్కొన్నారు. దీనికోసం ఇదే జిల్లాలోని కొయ్యలగూడెంలో సీఎం సన్మానం కూడా చేయించుకున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాల కోసం జిల్లా ప్రయోజనాలను తుంగలోకి తొక్కిందని విజయసాయి ధ్వజమెత్తారు.

పోలవరం ప్రాజెక్టు పనులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తే ఇప్పుడు చంద్రబాబు తానే  పోలవరం నిర్మాణం చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును ముడుపుల కోసం చంద్రబాబు తీసుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం  నచ్చిన అధికారులను వారికి కావాల్సిన చోటుకు, నిజా యితీగా ఉండే అధికారులను ప్రాధాన్యం లేని శాఖలకు బదిలీలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

రూ.5లక్షల కోట్ల దోపిడీ 
నాలుగున్నరేళ్ళ టీడీపీ పాలనలో రూ.5 లక్షల కోట్లు దోచుకుని విదేశాలలో దాచుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రతిదానికీ సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకునే చంద్రబాబు దోచిన డబ్బుతో రాష్ట్రాన్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేయవచ్చునన్నారు. సింగపూర్‌లోని తలసరి ఆదాయం, జీడీపీ ఎంత ఉందో ఇక్కడా ఆవిధంగా చేయవచ్చునన్నారు. విదేశాలకు తరలించిన సొమ్మును తిరిగి తీసుకు రావాలని డిమాండ్‌ చేశారు.

ప్రజాసమస్యలు తెలుసుకునేందుకే ప్రజా సంకల్ప యాత్ర
వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్రలోని ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే గత ఏడాది నవంబరులో ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారని విజయసాయిరెడ్డి చెప్పారు.  ఇప్పటికే 11 జిల్లాలో పర్యటించారని, 12వ జిల్లాగా విజయనగరంలో జగన్‌ పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విజయదుందుభి మోగిస్తుందని చెప్పారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు, కుటుంబాలకు, ప్రతి పౌరునికి లబ్ధి చేకూరుస్తారన్నారు. తండ్రికి మించిన తనయుడిగా పేరు తెచ్చుకుంటారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా టీడీపీకి బుద్ధి చెబుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.

శ్రేణులు అప్రమత్తం కావాలి 
ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో వైఎస్సార్‌ సీపీ అభిమానులు, కార్యకర్తల ఓట్లను ప్రతిచోటా పెద్ద ఎత్తున తొలగిస్తున్నారని, దీనిపై జిల్లాలోని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. బోగస్‌ ఓట్లు ఉన్న చోట్ల వాటిని తొలగించేలా చూడాలని సూచించారు. వైఎస్సార్‌ సీపీ అభిమానుల ఓట్లు తొలగిస్తే ప్రతిఘటించాలని, దీనిపై బూత్‌ స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి
అనంతరం నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 2019 సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని  పిలుపునిచ్చారు. నియోజకవర్గాల వారీగా సమీక్షించారు.  చేపట్టాల్సిన కార్యాచరణ, సంస్థాగత కూర్పు, అనుబంధ సంఘాలు చేయాల్సిన విధులు తదితర అంశాలపై నాయకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలను చేశారు. సమీక్ష సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్,  నియోజకవర్గాల సమన్వయకర్తలు ఆళ్ళ నాని (ఏలూరు), కొఠారు అబ్బయ్య చౌదరి (దెందులూరు), ఉన్నమట్ల ఎలీజా(చింతలపూడి ), పుప్పాల వాసుబాబు (ఉంగుటూరు),  కొట్టు సత్యనారాయణ(తాడేపల్లిగూడెం ),  కారుమూరి వెంకట నాగేశ్వరరావు(తణుకు),  తానేటి వనిత(కొవ్వూరు), తలారి వెంకట్రావు(గోపాలపురం ), తెల్లం బాలరాజు(పోలవరం), పీవీఎల్‌ నర్సింహరాజు(ఉండి), గ్రంధి శ్రీనివాసరావు( భీమవరం), గుణ్ణం నాగబాబు(పాలకొల్లు), చెరుకువాడ శ్రీరంగనాథరాజు(ఆచంట),  ముదునూరి ప్రసాదరాజు(నరసాపురం), రాష్ట్ర కార్యదర్శి పాశం రామకృష్ణ, నాయకులు జీఎస్‌ రావు, కవురు శ్రీనివాసరావు, ఉభయగోదావరి జిల్లాల మహిళా సమన్వయకర్త పిళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి, రైతు సంఘం నాయకులు కమ్మ శివరామకృష్ణ, దెందులూరు నియోజకవర్గ మహిళా నాయకురాలు తొత్తడి వేదకుమారి, దెందులూరు మండల కన్వీనర్‌ బొమ్మనబోయిన అశ్వినీ కుమార్‌(నాని), ఏలూరు నగర అ«ధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్‌ , కార్పొరేటర్లు బండారు కిరణ్‌కుమార్, కర్రి శ్రీనివాసరావు, నాయకులు మంచెం మైబాబు, నెరుసు చిరంజీవి, మున్నుల జాన్‌ గురునాధ్, గుడిదేశి శ్రీనివాసరావు, దిరిశాలప్రసాద్, మామిళ్లపల్లి జయప్రకాష్, గంపల బ్రహ్మావతి పాల్గొన్నారు.


Recommended Posts