కరుణానిధిని పరామర్శించిన వైసీపీ నాయకులు

కరుణానిధిని పరామర్శించిన వైసీపీ నాయకులు

కరుణానిధిని పరామర్శించిన వైసీపీ నాయకులు

YCP Leaders Meets karunanidhi In Kauvery Hospital - Sakshi

సాక్షి, చెన్నై : ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు పరామర్శించారు. తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సీనియర్‌ నేత బొత్స సత్యనారయణ, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిలతో పాటు వైఎస్‌ అనిల్‌ రెడ్డి సోమవారం సాయంత్రం కరుణానిధిని ఆసుపత్రిలో కలిసారు. కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్‌ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. కరుణానిధికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇక వైఎస్‌ జగన్‌ సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలతో మమేకం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వయంగా హాజరు కాలేని పరిస్థితి ఉండటంతో పార్టీ సినీయర్‌ నాయకులతో ఆయన కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వృద్ధాప్య రుగ్మతలతో సతమతం అవుతున్న కరుణానిధి ఆరోగ్యం క్షీణించడంతో గతనెల 28న కావేరీ ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. గొంతుకు అమర్చిన కృత్రిమశ్వాస గొట్టాన్ని మార్చిన కారణంగా ఆయన ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. ఆనాటి నుంచి స్పృహలేని స్థితిలో ఉండిన కరుణానిధి క్రమేణా కోలుకున్నారు. అయితే సోమవారం పరిస్థితి విషమించినట్లు వయోభారం వల్ల కరుణానిధి చికిత్సకు స్పందించేందుకు సమయం పడుతోందని కావేరి ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. కీలక అవయవాలు చికిత్సకు తగినంతగా సహకరించడం లేదని, ప్రత్యేక వైద్య బృందం ఆయనకు వైద్యచికిత్స అందిస్తోందని, రాబోయే 24 గంటలు చాలా కీలకమని తెలిపారు.


Recommended Posts