ద్రోహానికి నిరసనగానే ఎన్నికకు దూరం
ద్రోహానికి నిరసనగానే ఎన్నికకు దూరం
వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్పష్టీకరణ
రాష్ట్రాన్ని కాంగ్రెస్ నరికేసింది..
వైద్యం చేస్తామన్న బీజేపీ ద్రోహం చేసింది
అందుకే ఆ రెండు పార్టీల అభ్యర్థులకు మద్దతు ఇవ్వలేదు
కాంగ్రెసేతర ప్రతిపక్ష అభ్యర్థిని నిలిపితే మద్దతిచ్చేవాళ్లం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని గొడ్డలితో నరికి రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రానికి వైద్యం చేసి బాగు చేస్తామని హామీ ఇచ్చి ద్రోహం చేసిన బీజేపీ.. రెండూ దొందూ దొందేనని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్, బీజేపీ చేసిన ద్రోహానికి నిరసనగా, ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల అభ్యర్థులను బలపరచలేదని చెప్పారు. గురువారం డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు ముందు ఆయన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలిసి పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడారు.
విభజన వేళ ఏపీకి అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ పార్టీ కంటితుడుపు చర్యగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిందన్నారు. దాన్ని చట్టంలో పొందుపరచకుండా ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. విభజన చట్టంలోని హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని చట్టంలో పేర్కొనకపోవడంతో దీన్ని అవకాశంగా మార్చుకున్న బీజేపీ హామీలను విస్మరించిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని చట్టంలో పొందుపరిచి ఉంటే ఈరోజు బీజేపీకి రాష్ట్రాన్ని మోసం చేసే అవకాశం దక్కేది కాదన్నారు. అందుకే రాష్ట్రానికి చేసిన ద్రోహానికి నిరసనగా డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరచకూడదని తమ పార్టీ నిర్ణయించిందన్నారు.
యూపీఏ కూటమి ఎక్కడుంది?
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి ఒకరిని అభ్యర్థిగా నిలుపుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ చివరికి తన అభ్యర్థిని బరిలో దింపిందని విజయసాయిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ కాకుండా ఇతర ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిని పోటీ చేయించి ఉంటే వైఎస్సార్‌సీపీ మద్దతు ఇచ్చే ఉండేదని తెలిపారు. కానీ, బీజేపీ దాని మిత్రపక్ష అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ తన సొంత అభ్యర్థిని పోటీకి నిలపడంతో ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. అసలు దేశంలో ఇప్పుడు యూపీఏ కూటమి ఎక్కడుందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రతి ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలన్న తమ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
చంద్రబాబుకు నైతిక విలువల్లేవ్
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో తన అవకాశవాద రాజకీయాల కోసం చంద్రబాబు కలిశారని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఎలాంటి సిద్ధాంతాలు, నైతిక విలువలు లేవని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో ఎన్నోసార్లు యూటర్న్‌లు తీసుకున్నారని విమర్శించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతటి నీచస్థాయికైనా దిగజారుతారని, ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీతో కలవడమే అందుకు నిదర్శనమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను దారుణంగా మోసగించిన బీజేపీ, కాంగ్రెస్, టీడీపీల వైఖరికి నిసనగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఆ పార్టీలు నిలబెట్టిన ఆభ్యర్థులను బలపరచలేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
Recommended Posts
In media on 3 June 2024
03/06/2024
In media on 14 May 2024
14/05/2024
In media on 12 May 2024
12/05/2024