9 లక్షల ఇళ్లు కేటాయిస్తే.. లక్ష నిర్మించారు’
9 లక్షల ఇళ్లు కేటాయిస్తే.. లక్ష నిర్మించారు’
Dec 13, 2018, 20:03 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు 9.59 లక్షల ఇళ్లు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక లక్ష ఇళ్లు మాత్రమే కట్టిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ వివరాలను వెల్లడించింది. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పట్టణ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏపీకి 2015 నుంచి ఇప్పటివరకు 9 లక్షల 59 వేల 847 ఇళ్లు కేటాయించింది. కేంద్ర సాయం కింద 14వేల 414 కోట్ల రూపాయల విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు లక్ష 9 వేల 969 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింద’ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం రాజ్యసభలో తెలిపారు. అంతేకాకుండా రాతపూర్వకంగా జావాబిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై పథకం కింద రాష్ట్రానికి 3,267 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు. అలాగే రాష్ట్రంలో 5,298 ఇళ్ల సేకరణ/నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీ పథకం కింద 113 కోట్ల రూపాయల నిధులు కూడా రాష్ట్రానికి విడుదల చేసినట్టు చెప్పారు. పీఎంఏవై కింద విడుదల చేసిన 3,267 కోట్ల రూపాయలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2,788 కోట్ల మేరకు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించిందని పేర్కొన్నారు.
ఆంధ్ర జాలర్లను విడిపించేందుకు చొరవ తీసుకోండి: ఉపరాష్ట్రపతి
పాక్ అదుపులో ఉన్న ఆంధ్రప్రదేశ్ జాలర్లను విడిపించే దిశగా చొరవ తీసుకోవాలని అధికారులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. నవంబర్ నెలలో చేపల వేటకు వెళ్లిన ఏపీకి చెందిన 20 మంది జాలర్లు పొరపాటున పాక్ జలాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే పాక్ కోస్ట్ గార్డు సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విడిపించేందుకు చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి కోరడంతో విదేశాంగ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వీలైనంత త్వరగా ఏపీ జాలర్లను సురక్షితంగా విడిపించేందుకు ప్రయత్నిస్తామని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.
Recommended Posts
In media on 3 June 2024
03/06/2024
In media on 14 May 2024
14/05/2024
In media on 12 May 2024
12/05/2024