కుట్రలను వెలికితీయండి
కుట్రలను వెలికితీయండి
Oct 31, 2018, 05:38 IST
పౌర విమానయానశాఖ మంత్రి సురేష్‌ప్రభుకు ఎంపీ వి.విజయసాయిరెడ్డి లేఖ
విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నంపై విచారణకు ఆదేశిస్తారని విశ్వసిస్తున్నా
డీజీసీఏకు 13 ప్రశ్నలతో కూడిన లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం వెనుక దాగిన కుట్రలను వెలికి తీయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పౌర విమానయానశాఖ మంత్రి సురేష్‌ప్రభుకు లేఖ రాశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బి.ఎస్.భుల్లర్ నుంచి సంబంధిత సమాచారాన్ని ఆశిస్తున్నట్టు పేర్కొంటూ డీజీసీఏకు 13 ప్రశ్నలు సంధించారు. జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం వెనుక కుట్రలను వెలుగులోకి తెచ్చేందుకు రాజ్యసభ సభ్యుడిగా ఈ సమాచారాన్ని కోరుతున్నట్లు లేఖలో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. హత్యాయత్నం ఘటనపై దర్యాప్తునకు ఆదేశిస్తారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
డైరెక్టర్ జనరల్‌కు ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నలు ఇవీ..
– జె.శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఏరోడ్రమ్ ఎంట్రీ పర్మిట్(ఏఈపీ) కోసం దుండగుడు శ్రీనివాస్ లేదా అతడి యజమాని హర్షవర్దన్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి దరఖాస్తు సమర్పించారా? ఒకవేళ సమర్పిస్తే జె.శ్రీనివాసరావుకు నేర చరిత ఉన్న సంగతిని దరఖాస్తులో ప్రస్తావించారా? క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న సంగతి ప్రస్తావించారా?
– ఫ్యూజన్ రెస్టారెంట్లో పనిచేయడానికి అనుమతి ఇచ్చేముందు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నిందితుడు శ్రీనివాసరావు గత చరిత్ర గురించి ఏపీ పోలీసులను నివేదిక కోరారా? కోరితే ఏపీ పోలీసుల నుంచి వచ్చిన జవాబు ఏమిటి?
– జె.శ్రీనివాసరావుకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో పనిచేసేందుకు అవసరమైన అనుమతి ఉందా? అతడు అక్కడ ఏ ప్రాంతం/జోన్లో తిరిగేందుకు అనుమతి ఉంది?
– జె.శ్రీనివాసరావు లేదా హర్షవర్దన్‌లు ఏఏఐకి చెందిన లాంజ్ ఆఫీసర్ నుంచి గానీ మేనేజర్ నుంచి గానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ అధికారి నుంచి గానీ ఎయిర్‌పోర్టులోని ముఖ్య ప్రాంతాల్లో తిరిగేందుకు అనుమతి తీసుకున్నారా?
– విశాఖ ఎయిర్‌పోర్టులోని విమానాల్లో కూడా ఆహారం పంపిణీ చేసేందుకు జె.శ్రీనివాసరావు అనుమతి కలిగి ఉన్నాడా? ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌కు విభిన్న ఎయిర్‌లైన్ సంస్థలకు చెందిన విమానాల్లో ప్రయాణికులకు ఆహారం సరఫరా చేసేందుకు అనుమతి ఉందా?
– ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోని అన్ని సున్నితమైన ప్రాంతాల్లో తిరగడం వాస్తవం కాదా? అది నిజమే అయితే అందుకు అనుమతి ఎవరు ఇచ్చారు?
– ఏ నిబంధన కింద హర్షవర్దన్‌కు విశాఖ ఎయిర్‌పోర్టులో రెస్టారెంట్ నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేశారు? రెస్టారెంట్ నిర్వహణలో హర్షవర్దన్ ఏవైనా నిబంధనలు ఉల్లంఘించారా?
– సీఎం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రతిసారి హర్షవర్దన్ ఆయనకు స్వాగతం పలిపేందుకు విమానం వరకూ వెళ్లడం వాస్తవం కాదా? విమానం వరకూ వెళ్లి ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు హర్షవర్దన్‌కు ఎవరు అనుమతి ఇచ్చారు?
– హర్షవర్దన్‌పై గానీ రెస్టారెంట్‌పై గానీ అందులో పనిచేసే సిబ్బందిపై గానీ ఏవైనా ఫిర్యాదులు నమోదయ్యాయా?
– విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేసేందుకు ఎవరెవరిని అనుమతించారు?
– ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ పనివేళలు ఏమిటి?
– సిబ్బందికి పని వేళలు రోస్టర్ ప్రకారం ఉంటాయా? జె.శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పని వేళలు ఏమిటి?
– విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఎప్పుడు ఆడిట్ నిర్వహించింది? తనిఖీలు లేదా విచారణ చేసినప్పుడు హర్షవర్దన్ విషయంలో గానీ లేదా సిబ్బంది విషయంలో గానీ ఏవైనా అవకతవకలు గానీ నేరపూరిత చర్యలు గానీ నిబంధనల ఉల్లంఘన గానీ గుర్తించిందా? గుర్తిస్తే తీసుకున్న చర్యలేమిటి?
Recommended Posts
In media on 3 June 2024
03/06/2024
In media on 14 May 2024
14/05/2024
In media on 12 May 2024
12/05/2024