ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షులు శ్రీ కొణతాల రామకృష్ణ గారి నేతృత్వంలో విశాఖపట్నం నుంచి ఢిల్లీకి చేపట్టిన రైలు దీక్ష కార్యక్రమంలో
ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షులు శ్రీ కొణతాల రామకృష్ణ గారి నేతృత్వంలో విశాఖపట్నం నుంచి ఢిల్లీకి చేపట్టిన రైలు దీక్ష కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం శ్రీ కొణతాల బృందం ఢిల్లీలోని నా నివాసంలో నాతో భేటీ అయింది. రాష్ట్ర విభజన బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు రైలు దీక్ష చేపట్టినట్లు శ్రీ కొణతాల వివరించారు.
విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన ప్రధాన హామీలైన ప్రత్యేక హోదా, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కు అయ్యే పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించడం, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వంటి హామీలను తక్షణమే అమలు చేయాలన్నది వారి డిమాండ్.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ డిమాండ్ల సాధన కోసం ఎంతో కాలంగా పార్లమెంట్ లోపల, వెలుపల కూడా పోరాటం చేస్తున్నందున పార్టీ తరఫున, వ్యక్తిగతంగాను శ్రీ కొణతాలకు ఆయన ఆధ్వర్యంలోని ఉత్తరాంధ్ర చర్చా వేదికకు మా సంపూర్ణ సహాయ సహకారాలను అందించగలమని ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది.