బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి

బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి

బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి

ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలోని అనేక రాష్ట్రాలలో బాల్య వివాహాలు యధేచ్ఛగా జరిగిపోతున్నాయి. బాల్య వివాహాలను నిషేధిస్తూ 2006లో పార్లమెంట్ చట్టం చేసినప్పటికీ ఈ దుస్సంప్రదాయానికి అది అడ్డుకట్టవేయలేకపోయింది. సుమారు 16 ఏళ్ళ క్రితం వచ్చిన ఈ చట్టం ఎక్కడా సక్రమంగా అమలు జరుగుతున్న దాఖలాలు లేవు. బాలల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన జాతీయ కమిషన్ అంచనాల ప్రకారం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గడచిన అయిదేళ్ళ కాలంలో వివాహం చేసుకునే వయసుకు చేరుకోని 1.72 లక్షల మంది బాలికలు, 1.73 లక్షల మంది బాలురకు చట్ట విరుద్ధంగా వివాహాలు జరిగాయి.

బాలికలకు 18 ఏళ్ళు, బాలురకు 21 ఏళ్ళు నిండకుండానే బాల్య వివాహాలు జరిగిన జిల్లాలలో కృష్ణా జిల్లా ప్రధమ స్థానంలో (40 వేల బాల్య వివాహాలతో) ఉంది. ఆ తర్వాత స్థానంలో విశాఖపట్నం జిల్లా, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలు ఉన్నట్లుగా జాతీయ కమిషన్ స్పష్టం చేసింది. చట్టాన్ని సైతం అతిక్రమిస్తూ అడ్డూ అదుపూ సాగిపోతున్న బాల్య వివాహాల ప్రభావం సమాజంపై ప్రబలంగా పడే ప్రమాదం ఉంది. బాల్య వివాహాలు తీవ్రమైన విపరిణామాలకు దారి తీస్తాయన్నది జగమెరిగిన సత్యం.

బాల్య వివాహం చేసుకున్న బాలికలలో తలెత్తే ఆరోగ్య సమస్యల వలన ప్రసవ సమయంలో మరణాల సంఖ్య పెరిగిపోతోంది. అలాగే నిరంతరం సంతానాన్ని కంటూ వాళ్ళ ఆలనా పాలనా చూడాల్సిన బాధ్యతలు నెత్తిమీద పడుతున్నందున అలాంటి ఆడపిల్లల విద్యావకాశాలు అర్థాంతరంగా నిలిచిపోతున్నాయి. అందువలన బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ కఠినంగా అమలు చేయవలసిందిగా మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిని కోరుతున్నా. వివాహాల నమోదు ప్రక్రియను తప్పనిసరి చేస్తూ నిబంధనను తీసుకురావాలని కోరుతున్నా.