కావాలంటే వంగవీటి రాధాతోనే ఆ విషయం చెప్పిస్తా…

కావాలంటే వంగవీటి రాధాతోనే ఆ విషయం చెప్పిస్తా…

Teluguglobal  4 Nov, 2016

విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్షంగా ఫైర్ అయ్యారు. వెలగపూడి రామకృష్ణ కారణంగా వంగవీటి రంగా కుటుంబం అనేక ఇబ్బందులు పడిందని చెప్పారు. రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి(వెలగపూడి రామకృష్ణ) విజయవాడ నుంచి పారిపోయి వచ్చి విశాఖలో సెటిల్‌ అయ్యారని విమర్శించారు. అలా వచ్చిన వ్యక్తి నామమాత్రపు సేవలు చేస్తూ ఏకంగా ప్రజా ప్రతినిధి అయ్యారని మండిపడ్డారు. అతడి అకృత్యానికి వంగవీటి రంగా కుటుంబం ఏ విధంగా ఇబ్బంది పడిందో… వంగవీటి రాధాను అడిగితే ఇంకా బాగా తెలుస్తుందన్నారు. కావాలంటే తానే వంగవీటి రాధాను ఇక్కడికి తీసుకొచ్చి ఆయనతోనే ఈ వివరాలు చెప్పిస్తానని విజయసాయిరెడ్డి అన్నారు.

రాష్ట్ర విభజనకు టీడీపీ, బీజేపీ దొంగచాటుగా మద్దతు పలికాయని సాయిరెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి తర్వాత నమ్మకద్రోహం చేశారని బీజేపీ, టీడీపీలపై మండిపడ్డారు. విశాఖ తూర్పు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంతో విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమానికి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ,మేరుగ నాగార్జున తదితరులు హాజరయ్యారు.


Recommended Posts