పోలవరంపై రాజ్యసభలో కీలక చర్చ

పోలవరంపై రాజ్యసభలో కీలక చర్చ

పోలవరంపై రాజ్యసభలో కీలక చర్చ

Sakshi | Updated: July 24, 2017

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో సోమవారం కీలక చర్చ జరిగింది. రివైజ్డ్‌ ఎస్టిమేషన్స్‌కు ప్రాజెక్ట్‌ అథారిటీ ఆమోదం ఉందా అని ప్రభుత్వాన్ని వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రూ. 16 వేల కోట్ల అంచనాలకు ఆమోదం ఉందని, ఆ తర్వాత రివైజ్డ్‌ ఎస్టిమేషన్‌ రాలేదని కేంద్ర మంత్రి సంజయ్‌ బల్యాన్‌ సమాధానమిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే రూ3,300 కోట్లు విడుదల చేశామని, మరో రూ.1000 కోట్లు త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

బీజేడీ ఎంపీ నరేంద్రకుమార్‌ స్వాన్‌ మధ్యలో జోక్యం చేసుకుని..  పోలవరం అంశం కోర్టులో ఉండగా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. పోలవరంపై కోర్టులో ఎటువంటి స్టే లేదని, పర్యావరణ ప్రభావ మదింపు జరుగుతోందని మంత్రి సంజయ్‌ బల్యాన్‌ వెల్లడించారు. ఒడిశాపై ఏదైనా ప్రభావం  ఉంటే ఖర్చు పూర్తిగా కేంద్రమే భరిస్తుందని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు గిరిజనుల ప్రాంతంలో ఉందని, 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు భూమి ఇవ్వాలని.. ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా లక్షా 8 వేల మంది నిరాశ్రయులయ్యారని, వీరి కోసం రూ.9,800 కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రి  సంజయ్‌ బల్యాన్‌ తెలిపారు. 28,557 కుటుంబాలను తరలించామని, ఇందులో 3,052 మందికి పునరావాసం కల్పించామన్నారు.

ఏ కారణంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రానికి బదలాయించారని కాంగ్రెస్‌ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌ ప్రశ్నించారు. నీతి ఆయోగ్‌ సిఫారసు మేరకే నిర్మాణ బాధ్యతలను ఏపీకి అప్పగించామని సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ తయారుచేస్తోందని, త్వరలోనే ప్రతిపాదనలు కేంద్రానికి అందుతాయని చెప్పారు.


Recommended Posts