ఏం ఉద్దరించారని ఈ ‘పబ్లిసిటీ’ పండుగ!
ఏం ఉద్దరించారని ఈ ‘పబ్లిసిటీ’ పండుగ!
——————————————
1500 రోజుల (పబ్లిసిటీ) పండగ(ట)! ఏం ఉద్దరించారని ఈ పండగలు? పాలన సమస్తం దోపిడీ, అవినీతిమయం అయినందుకా?. మీ పాలనను పండగ చేసుకునేది ప్రజలు కాదు. మీ అండదండలతో ప్రజా ధనాన్ని అడ్డంగా దోచుకున్న మీ అనుచరగణం మాత్రమే.
1500 రోజుల ప్రగతి…అంటూ ఈరోజు పత్రికలలో మీరు మొదలెట్టిన ప్రచార పటాటోపం అంతా పచ్చి అబద్దాలు, బూటకం కావా? ఇంకా ఎంతకాలం ఇలాంటి మోసపూరిత ప్రకటనలతో ప్రజలను మభ్యపెడతారు?
విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ స్థాపించినట్లుగా విజయాల లిస్ట్‌లో ప్రకటించుకున్నారు. ఇంతకంటే దారుణమైన అబద్ధం ఇంకోటి ఉంటుందా? అసలు ఈ ప్రాజెక్ట్‌కు ఎప్పుడు శంకుస్థాపన చేశారు? ఎవరు కొబ్బరికాయ కొట్టారు? అన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌ను అర్థరాత్రి వేళ, చీకట్లో ఎవరి కంటికి తెలియకుండా ఎప్పుడు, ఎక్కడ మొదలెట్టారో చంద్రబాబు నాయుడు గారే సెలవివ్వాలి?
ఇక రెండోది…మూడు భాగస్వామ్య పెట్టుబడుల సదస్సుల ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రానికి లక్షా 48 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 721 పరిశ్రమలు వచ్చేశాయని, దాదాపు రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చేశాయని ప్రకటించుకున్నారు? ఛీ…మిమ్మల్ని చూసి అబద్దం కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది.
మూడు పెట్టుబడుల సదస్సుల ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రానికి 9 లక్ష కోట్లు వచ్చాయని స్వయంగా మీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆ మధ్యనే ప్రకటించారు కదా!
కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్ (డీఐపీపి) గణాంకాల ప్రకారం చూసినా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 25 వేల కోట్లకు మించి లేవు. అలాంటిది ఏకంగా లక్షా 48 వేల కోట్లతో 721 పరిశ్రమలు ఏర్పాటు జరిగినట్లు ప్రకటించుకోవడం సిగ్గుమాలిన దౌర్భాగ్యపు చర్య కాదా?.
సమాజంలో ఏ ఒక్క వర్గం ప్రజలన్నా సంతోషంగా, సుఖశాంతులతో ఉన్నారా? మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. నేరస్తుల్లో అత్యధికులు తెలుగు తమ్ముళ్ళే అన్నది వాస్తవం కాదా? మీవాళ్ళే మహిళలపై దురాగతాలకు పాల్పడుతున్నా ఏనాడైనా మీరు నోరు విప్పారా?. కాల్ మనీ సెక్స్ రాకెట్లో నేరస్తులంతా పచ్చ చొక్కా నేతలని తేలినా ఇప్పటి వరకు ఒక్కరిపైనన్నా చర్యలు తీసుకున్నారా?
పేదల పాలిట సంజీవిని అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మంచంపట్టించారు. 108 వాహనాలను రోడ్లపై నుంచి షెడ్డులోకి నెట్టారు. ప్రజా వైద్యం మొత్తాన్ని ప్రైవేట్ చేతుల్లో పెట్టేశారు. రుణ మాఫీ పేరుతో రైతులను నిలువునా దగా చేశారు. డ్వాక్రా అక్క చెల్లెళ్ళను అబద్దపు హామీలతో నిలువునా ముంచేశారు. అమరావతి పేరుతో పచ్చటి పంట భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేశారు.
‘అదిగో అమరావతి…ఇదిగో అమరావతి’…అంటూ నాలుగేళ్ళుగా గ్రాఫిక్స్‌తో ప్రజల కళ్ళకు గంతలు కడుతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల పేరుతో మీ బినామీలు, అనుచరులకు వేల కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారు.
నిరుపేదలకు అందించే పెన్షన్, రేషన్, పక్కా ఇళ్ళను సైతం దారి మళ్ళించడానికి పచ్చ చొక్కాలకు లైసెన్స్‌లు ఇచ్చేశారు. ‘ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా’…అన్న చందంగా అవినీతి, అక్రమార్జనలతో పచ్చ చొక్కాలకు మీరు ఆదర్శంగా నిలిచినందుకే కదా చివరకు ఇసుక, మట్టిని కూడా నోట్లోకి కుమ్మేసుకుని వారు కోట్లకు పడగలెత్తారు.
విదేశీ పర్యటనల పేరుతో మీరు, మీ పరివారం ఎన్ని వందల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు? విభజన తర్వాత కట్టు బట్టలతో మిగిలిన ఆంధ్ర రాష్ట్రం…మీ పాలనలో ఏకంగా 2 లక్షల కోట్లకు పైబడి అప్పుల్లో మునిగిపోయింది విచ్చలవిడిగా సాగుతున్న ఇలాంటి విలాసాలు, దుబారాల వలన కాదా?
నాలుగేళ్ళ పాటు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కొనసాగి విభజన హామీలపై ఏనాడు గట్టిగా నిలదీయకుండా ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన మిమ్మల్ని తెలుగు జాతి ఏనాటికైనా క్షమిస్తుందా?
పండుగల పేరుతో వందల కోట్ల రూపాయల ఖర్చుతో మీరు సాగించే ప్రకటనల జోరు, హోరుతో ప్రజలను ఇంకెంతో కాలం మభ్యపెట్టలేరు. మీ పాలనకు అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయి. మీరు అధికార పీఠం నుంచి దిగిన రోజునే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిజమైన పండగ వస్తుంది.
Recommended Posts
In media on 3 June 2024
03/06/2024
In media on 14 May 2024
14/05/2024
In media on 12 May 2024
12/05/2024